సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ!
సభ ముందుకు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాలు
ఫీజు రీయింబర్స్మెంట్, పాలిటెక్నిక్ సమస్యలు, 22-A జీవోపై
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాల వ్యూహం!
మినిట్ 2 మినిట్, హైదరాబాద్ (ఆగస్ట్ 25): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై తొలి రోజు సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులతో పాటు విధానపరమైన నిర్ణయాలను సభ ముందు ఉంచే అవకాశముంది.
మరోవైపు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షాలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ కళాశాలల సమస్యలు మరియు రిజిస్ట్రేషన్ల చట్టంలోని వివాదాస్పద 22-A జీవో అమలుపై సభలో నిలదీసేందుకు విపక్షాలు కార్యాచరణ రచిస్తున్నాయి. ప్రజా సమస్యలపై శాసనసభ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు, మాటల యుద్ధం జరిగే అవకాశముండటంతో ఈ సమావేశాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
