ఈనెల 27న గ్రామ, వార్డు సభలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
మినిట్ 2 మినిట్, రంగారెడ్డి(ఆగస్ట్ 25): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సభల్లో బిఎల్వోలు ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ (ASD) జాబితాలను చదివి వినిపించాలని ఆదేశించారు.
సభల్లో ఫారం-6, 7, 8లను అందుబాటులో ఉంచి అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని, పెండింగ్ నోటీసుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో కేవలం 3,355 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
