గంటల చప్పుడు లేని దైవ సన్నిధి.. తెర వెనుక దాగున్న ఆశ్చర్యకరమైన నిజం ఏమిటి?

Banke Bihari

Banke Bihari

Banke Bihari: సనాతన హిందూ సంప్రదాయంలో గుడికి వెళ్లగానే గంట మోగించడం ఎంతో పవిత్రమైన ఆచారంగా భావిస్తాం. దేవుడికి మన రాకను తెలియజేయడానికి, మనసులోని చెడు ఆలోచనలను తొలగించి ఏకాగ్రతను పెంచడానికి గంటానదం దోహదపడుతుందని నమ్ముతాం. అయితే, దేశంలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నప్పటికీ… అసలు గంట శబ్దమే వినిపించని, గంటలనే ఏర్పాటు చేయని ఒక అద్భుతమైన ఆలయం గురించి మీకు తెలుసా? అదే ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా, బృందావనంలో విరాజిల్లుతున్న ప్రసిద్ధ “శ్రీ బాంకే బిహారీ ఆలయం”. ఇక్కడి విశేషాలు ఎంతో ఆశ్చర్యకరంగా మరియు భక్తిభావం కలిగించేలా ఉంటాయి.

చిరునవ్వులు చిందించే బాలగోపాలుడు

ఈ దివ్యక్షేత్రంలో కొలువైన శ్రీకృష్ణుడిని సాధారణ రూపంలో కాకుండా, ఎంతో ముద్దులొలిగే చిన్నారి రూపంలో (బాల గోపాలుడిగా) కొలుస్తారు. ఇక్కడి బాంకే బిహారీ స్వామి విగ్రహం త్రిభంగ ముద్రలో, కన్నులవిందుగా నిలబడి భక్తులను కటాక్షిస్తుంటుంది. స్వామివారి రూపాన్ని చూస్తే చాలు, మనసులోని బాధలన్నీ మాయమై ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆలయంలో భగవంతుడిని ఒక చిన్న బిడ్డలా చూసుకునే పద్ధతి ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఇక్కడ పూజా విధానాలు కూడా సాధారణాలయాలకంటే కాస్త భిన్నంగా, అత్యంత ప్రేమపూర్వకంగా సాగుతాయి.

గంట లేకపోవడానికి కారణం ఏమిటి?

ఈ ఆలయంలో గంటలు ఎందుకు లేవనే దాని వెనుక ఒక సున్నితమైన భావోద్వేగం దాగి ఉంది. చిన్న పిల్లలు నిద్రపోతున్నప్పుడు లేదా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక్కసారిగా పెద్ద శబ్దాలు వస్తే వాళ్ళు ఉలిక్కిపడి భయపడతారు. అలాగే, భగవంతుడైన ఆ బాలకృష్ణుడికి ఎటువంటి శబ్ధాల వల్ల అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా గంటలను ఏర్పాటు చేయలేదు. స్వామివారి ప్రశాంత విశ్రాంతికి భంగం కలగకూడదనే భక్తుల గాఢమైన నమ్మకమే దీనికి అసలు కారణం. కేవలం శ్రీకృష్ణాష్టమి వంటి పవిత్రమైన పండుగ రోజుల్లో మాత్రమే ప్రత్యేక పూజల నిమిత్తం చిన్న గంటను ఉపయోగిస్తారు.

నిరంతరం కనిపించని ఆ దైవ రూపం

ఈ ఆలయంలో మరో వింత ఆచారం కూడా ఉంది. సాధారణంగా ఏ గుడికి వెళ్లినా గర్భగుడి తెరలు తెరిచి ఉంటే దేవుడిని నిరంతరం దర్శించుకోవచ్చు. కానీ, బాంకే బిహారీ ఆలయంలో మాత్రం భక్తులు దేవుణ్ణి నిరంతరం చూడటానికి వీలు లేకుండా ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి తెర (కర్టెన్) అడ్డుగా వేస్తుంటారు. కొద్దిసేపు దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ తెర వేయడం ఇక్కడ ఆనవాయితీ.

తెరల వెనుక ఉన్న పరమార్థం

ఈ విచిత్రమైన ఆచారం వెనుక భక్తుల నమ్మకం ఏమిటంటే… బాంకే బిహారీ మూర్తిని నిరంతరం అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే, స్వామివారే భక్తుల అపారమైన భక్తికి ముచ్చటపడి వారి వెంటే ఇంటికి వచ్చేస్తారట! అందుకే భక్తులు తనను శాశ్వతంగా వెంబడించకుండా ఉండేందుకు, స్వామివారే స్వయంగా ఆ తెరలను అడ్డుపెట్టుకుంటారని ఇక్కడి ప్రజలు గాఢంగా విశ్వసిస్తారు. భక్తికి, భగవంతుడికి మధ్య ఉన్న ఈ మధురమైన అనుబంధాన్ని చాటిచెప్పే ఈ అద్భుతమైన బృందావన బాంకే బిహారీ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవడం నిజంగా ఒక దివ్య అనుభూతి.