ప్రభుత్వం స్పందించేదాకా తగ్గేదేలే.. జీఓ 97 రద్దుకై విద్యార్థుల వినూత్న నిరసన!

Polytechnic Protest

Polytechnic Protest

Polytechnic Protest: జీఓ నెంబర్ 97 రద్దును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్యమం శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ‘జీఓ 97’ ఆంగ్ల అక్షరాల ఆకారంలో కూర్చుని నిరసన తెలిపారు.

విద్యార్థులు తమ పుస్తకాల బ్యాగులను మధ్యలో ఉంచి బతుకమ్మల మాదిరిగా పేర్చారు. ఆ బ్యాగుల చుట్టూ తిరుగుతూ శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఉద్యమం ప్రారంభించి 25 రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ ఉనికిని కాపాడేలా ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.