Freebies Politics: “నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం” అంటూ మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి నాడు ఆవేదనతో రాసిన అద్భుత అక్షరాలు నేటి భారత సమాజం దుస్థితికి అచ్చంగా అద్దం పడుతున్నాయి. అన్యాయాన్ని చూస్తూ తలదించుకునే నిస్సహాయత, ఇదేంటని నిలదీయలేని నిర్లిప్తత మధ్య మన ప్రయాణం వేకువ వైపు సాగుతోందా లేక అగాధమైన చీకటిలోకా అన్నది నేడు ప్రతి పౌరుడినీ తొలుస్తున్న ప్రశ్న. 80 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో మనం సాధించిన ప్రగతి వెనుక, గతి తప్పుతున్న సామాజిక విలువల చీకటి కోణం కళ్లముందు కదలాడుతోంది.
నేడు మన దేశంలో అవినీతి అనేది ఒక వ్యక్తిగత లోపం కాదు, అదొక వ్యవస్థీకృత మహావృక్షంగా మారిపోయింది. ఏది తప్పో, ఏది ఒప్పో విచక్షణ కోల్పోయిన సమాజంలో సామాన్యుడు నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. ఇక్కడొక విచిత్రమైన వ్యవస్థ నడుస్తోంది. ఏసీబీ దాడుల్లోనో, విచారణల్లోనో కేవలం కిందిస్థాయి అధికారులు మాత్రమే బలిపశువులుగా దొరుకుతారు కానీ, తెరవెనుక ఉండి ఆడించే అవినీతి రాజకీయ నేతలు మాత్రం ఏ మరకా అంటకుండా దర్జాగా తిరుగుతుంటారు. చట్టం కేవలం బలహీనులకే చుట్టమా అనే సందేహం సామాన్యుడి గుండెల్లో రగులుతోంది.
మరోవైపు, సామాన్య మానవుడి జీవితం ఆస్పత్రి బిల్లులు, పాఠశాలల ఫీజుల మధ్య నలిగిపోతోంది. ప్రాణం నిలబెట్టుకోవాలంటే లక్షల రూపాయలు ఆస్పత్రులకు ధారపోయాల్సిన దుస్థితి. బిడ్డలకు నాలుగు అక్షరాలు నేర్పించాలంటే కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల భారాన్ని మోయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కనీస అవసరాలైన విద్య, వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసిన పాలకులు, ప్రజల ఆకలిని తీర్చడానికి బదులుగా ‘ఉచితాల’ పేరిట బిస్కట్లు వేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. సంక్షేమం ముసుగులో రాష్ట్రాల ఖజానాలను ఖాళీ చేస్తూ, భవిష్యత్తు తరాలను అప్పుల ఊబిలోకి నెట్టేయడమేనా అసలైన రాజకీయ చాణక్యం? స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ, ఆశల పల్లకీలో మభ్యపెడుతూ సాగుతున్న ఈ పాలన.. మనకు ఇచ్చిన బహుమానం ఇదేనా? నడిచే శవాల్లా మారిన సమాజం ఇప్పటికైనా మేల్కొనకపోతే, చరిత్ర మనల్ని క్షమించదు.
