Sabarimala Entry: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రవేశంపై మరోసారి న్యాయపరమైన వివాదం రాజుకుంది. ఆలయంలోకి ట్రాన్స్జెండర్ భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగిన వైద్య లేదా అధికారిక లింగ నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదని కేరళ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ప్రభుత్వం తేల్చిచెప్పింది.
తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ అయ్యప్ప భక్తురాలు ఆచారాల ప్రకారం మాల ధరించి స్వామివారి దర్శనానికి వెళ్లగా, ఆగస్టులో పోలీసులు అడ్డుకున్నారు. గతంలో జనవరి, ఏప్రిల్ నెలల్లో తాను ఆలయాన్ని సందర్శించానని, నిబంధనల ప్రకారం క్రతువులు పూర్తి చేసిన ట్రాన్స్జెండర్లకు దర్శన భాగ్యం కల్పించాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన దేవస్థానం బోర్డు, ఒక వ్యక్తి మహిళా లేక ట్రాన్స్జెండరా అన్న విషయాన్ని నిర్ధారించే అధికారం తమకు లేదని కోర్టుకు నివేదించింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అనుమతిస్తే తరతరాలుగా వస్తున్న పవిత్ర ఆచారాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని బోర్డు స్పష్టం చేసింది.
శబరిమల ఆలయ ప్రవేశం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని కేరళ సర్కార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువడే వరకు దేవస్థానం బోర్డు వైఖరికి భిన్నంగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. భక్తి, ఆచారాలు, సమాన హక్కుల మధ్య నడుస్తున్న ఈ న్యాయ పోరాటం ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
