సీఈసీపై ‘ఇండియా’ కూటమి నిప్పులు.. ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం!

Vote Theft

Vote Theft

Vote Theft: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలితో పాటు ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను తీవ్రంగా నిరసిస్తూ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే సీఈసీ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రికార్డు స్థాయిలో తరలివచ్చి గళమెత్తిన ప్రజలందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రజా ఉద్యమమే ప్రజాస్వామ్యాన్ని, సత్యాన్ని, ‘ఇండియా’ కూటమిని విజయం దిశగా నడిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం మంది ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని తీవ్రంగా ఆరోపించారు. దీనిబట్టి 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా చట్టవిరుద్ధంగా, ఓట్లు దొంగిలించి ప్రజా తీర్పును మళ్లించడం ద్వారానే జరిగాయని తేటతెల్లమవుతోందన్నారు. ఇవి తాను స్వయంగా చెబుతున్న మాటలు కావని, స్వయంగా ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలే ఈ నిజాలను బయటపెడుతున్నాయని స్పష్టం చేశారు.

దేశంలో ఎన్నో ఏళ్లుగా ‘ఓటు చోరీ’ దందా నిరాటకంగా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా పని పడతామని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రక్రియలో భారీ ఎత్తున ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆధారాలతో సహా బయటపడినప్పటికీ, సీఈసీని కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఎస్‌ఆర్‌ఆర్‌లో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్ వివరాలపై ఆర్టీఐ కింద సమాచారం కోరితే, ‘ట్రేడ్ సీక్రెట్స్’ పేరిట దాటవేయడం వెనుక తీవ్ర కుట్ర దాగి ఉందని నేతలు మండిపడ్డారు.