హన్మకొండలో భారీ ప్రమాదం.. బస్సుపై కూలిన వృక్షం.. నుజ్జునుజ్జయిన వాహనాలు!

Bus Accident

Bus Accident

Bus Accident: హన్మకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా నేలకూలి రోడ్డుపై వెళ్తున్న బస్సుపై పడింది. ఈ ఊహించని ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కేకలు వేశారు.

భారీ చెట్టు కూలిపడటంతో ఆ సమయంలో అక్కడే పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు దాని కిందపడి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే చెట్టు కొమ్మలు బస్సుపై పడినప్పటికీ, అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, నివారణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దారికి అడ్డంగా పడిన చెట్టు కొమ్మలను తొలగించి, ఆ ప్రాంతంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న ఆటోలను, బైకులను పక్కకు తొలగించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.