కోస్తా ఆసరా.. తెలంగాణ పోరాట కేక.. సరిహద్దులు దాటిన తెలుగు వారి ఐక్యత!

Telangana Struggle

Telangana Struggle

Telangana Struggle:  గోలకొండ ఖిల్లాపై నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం ప్రసాదించిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం 1946 జులై 4న ప్రారంభమై 1948 సెప్టెంబర్ 17 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ విప్లవ చరిత్రలోనే ఒక అపూర్వ అధ్యాయం. మాతృభాషకు దూరమై, బానిస బతుకులతో అలమటిస్తున్న తరుణంలో రజాకార్ మూకలను ఎదుర్కొని తెలుగు నేలకు పట్టిన తరతరాల బూజును వదిలించిన యోధుల త్యాగాలు చిరస్మరణీయాలు. ఆర్యసమాజ్, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ, స్టేట్ కాంగ్రెస్ వంటి వేదికలు ఈ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించాయి.

అయితే ఈ వీరోచిత పోరాటం వెనుక ప్రపంచానికి పెద్దగా తెలియని మరో మహోజ్వల చారిత్రక సత్యం ఉంది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలు, నాయకులు అందించిన అపారమైన సహాయ సహకారాలే ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి. నిజాం సైన్యాలు, రజాకార్ల హింసాకాండ తారాస్థాయికి చేరిన వేళ, తెలంగాణ పోరాట యోధులకు కోస్తా ఆంధ్ర ఒక ప్రధాన రక్షణ స్థావరంగా మారింది. భౌగోళిక సరిహద్దులు వేరైనా, తమ తోటి తెలుగు ప్రజల స్వేచ్ఛ కోసం కోస్తా నేల కంటికి రెప్పలా కాపాడుకుంది.

ఖమ్మం, నల్గొండ ప్రాంతాల నుంచి రజాకార్ల దాడులకు తట్టుకుని వచ్చిన గెరిల్లా దళాలకు, కమ్యూనిస్టు నాయకులకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు సురక్షిత ఆశ్రయం కల్పించాయి. సరిహద్దు వెంబడి రహస్య శిబిరాలు వెలిసాయి. తుపాకులు, మందుగుండు సామాగ్రిని రహస్యంగా తెలంగాణలోకి చేరవేయడంలో కోస్తా కేడర్ ప్రాణాలకు తెగించింది. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు గెరిల్లా పోరాట వ్యూహాలపై యువతకు శిక్షణ నివ్వడమే కాకుండా, స్వయంగా ఆయుధ సంపత్తిని సమకూర్చారు. గాయపడిన విప్లవకారులకు రహస్య కేంద్రాల్లో వైద్యం అందించారు.

ఈ పోరాటంలో కోస్తా ప్రాంతం నుంచి వేలాది మంది కార్యకర్తలు ప్రత్యక్షంగా తెలంగాణలోకి ప్రవేశించి తుపాకులు పట్టి పోరాడారు. 10,000 కి పైగా కుటుంబాలు తమ ఇళ్లలోనే ఉద్యమకారులకు రహస్య ఆశ్రయాన్నిచ్చాయి. కవుల విప్లవ గీతాలు, మేధావుల ప్రచారాలు, విద్యార్థుల ప్రదర్శనలు పరోక్షంగా లక్షలాది మందిలో పోరాట స్ఫూర్తిని రగిల్చాయి. రైతులు, కూలీలు చందాల రూపంలో నిధులు సేకరించి ఉద్యమానికి ఆర్థిక బలాన్ని చేకూర్చారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో తెలుగువారి ఐక్యత, సోదరభావం అత్యున్నత శిఖరాలకు చేరాయి. సరిహద్దులను చెరిపేసి, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ చారిత్రక సహకారం తెలుగు నేల ఐక్యతా భావనకు పటిష్టమైన పునాది వేసింది. చరిత్ర పుస్తకాల్లో తగినంతగా నమోదు కాని ఈ రక్తం పంచుకున్న బంధాన్ని, అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.