కోలీవుడ్ టూ టాలీవుడ్.. విజయ్ కొడుకు దర్శకత్వంలో ‘సిగ్మా’.. తొలి సినిమాతోనే సంచలనం!

Jason Sanjay

Jason Sanjay

Jason Sanjay: కోలీవుడ్ నటుడు విజయ్ తనయ్ జేసన్ సంజయ్ తన సినీ ప్రయాణాన్ని విభిన్నంగా ప్రారంభించబోతున్నాడు. తండ్రిలా వెండితెరపై నటుడిగా కాకుండా, కెమెరా వెనుక నిలబడి కథను నడిపించే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘సిగ్మా’ ద్వారా జేసన్ మెగాఫోన్ పట్టాడు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక మీడియా సమావేశం తాజాగా హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

విదేశీ శిక్షణతో పక్కా ప్లానింగ్

ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దర్శకుడు జేసన్ సంజయ్ తన సినీ కలల వెనుక ఉన్న కష్టాన్ని పంచుకున్నాడు. విదేశాల్లో స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ కోర్సులు పూర్తి చేసిన అతడు, సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్స్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు తెలిపాడు. తన కలలను నిజం చేసుకునే క్రమంలో తండ్రి విజయ్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని గుర్తుచేసుకున్నాడు. ఇక ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ కనబరిచిన నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే ఈ విభిన్నమైన కథకు ఆయనే సరైన ఎంపిక అని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన తొలి చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు తండ్రి విజయ్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని జేసన్ సంతోషం వ్యక్తం చేశాడు.

సొంతంగా డబ్బింగ్ చెప్పిన ఫరియా

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన గ్లామరస్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘సిగ్మా’ తన మొదటి తమిళ ప్రాజెక్ట్ అయినప్పటికీ, కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తన పాత్రను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు, వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే ధీమాను హీరో సందీప్ కిషన్ వ్యక్తం చేశాడు.

కోలీవుడ్ టూ టాలీవుడ్: ఆసక్తికరమైన కాంబినేషన్

విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఆయన కుమారుడు జేసన్ సంజయ్ ఎంచుకున్న ఈ కొత్త దారి చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ పుత్రుడు దర్శకత్వం వైపు అడుగులు వేయడం, అది కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.