Bhagat Singh: భారతమాత విముక్తి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన అసమాన పోరాట యోధుడు, విప్లవ జ్వాల భగత్ సింగ్ జయంతి నేడు. నిండా 25 ఏళ్లు కూడా లేని చిన్న వయసులోనే, బ్రిటీష్ సామ్రాజ్యవాద పునాదులను కదిలిస్తూ ఉరికంబం ఎక్కిన ఆయన ధైర్యం భారత చరిత్రలో చిరస్మరణీయం. కేవలం ఆయుధాలతోనే కాకుండా, ఆలోచనలతో కూడా విప్లవాన్ని రగిలించవచ్చని నిరూపించిన మహనీయుడు ఆయన. స్వేచ్ఛా భారత్ కోసం ఆయన చేసిన త్యాగం యావత్ భారత జాతి గుండెల్లో నేటికీ సరికొత్త చైతన్యాన్ని రగిలిస్తూనే ఉంది.
బ్రిటీష్ పాలకుల అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదంతో దేశాన్ని మేల్కొలిపారు భగత్ సింగ్. సమాజంలో మూఢనమ్మకాలు, అసమానతలు తొలగిపోవాలని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు లభించాలని ఆయన కలలు కన్నారు. దేశం కోసం త్యాగం చేయడం కంటే మిన్నయినది ఏదీ లేదని నమ్మి, నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడి భారత స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిపోశారు.
ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా జెన్ జీ (Gen Z) తరానికి భగత్ సింగ్ ఒక నిత్య స్ఫూర్తిదాయకమైన రగిలే అగ్నికణం. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, ప్రశ్నించే తత్వం, మాతృభూమి పట్ల బాధ్యత కలిగి ఉండటంలో ఆయన ఆలోచనలు యువతకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా, ఆ మహనీయుని త్యాగాలను, సిద్ధాంతాలను మనసా వాచా కర్మణా స్మరించుకుంటూ, ఆయన చూపిన పోరాట బాటలో సాగడమే మనం ఇచ్చే నిజమైన నివాళి.
