Operation Chabutra: శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి సమయాల్లో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని నియంత్రించే లక్ష్యంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో SI B జ్ఞానేశ్వర్ నేతృత్వంలో ‘ఆపరేషన్ ఛబుత్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సైదాబాద్, పరిసర ప్రాంతాల్లోని చౌరస్తాలు, పార్కులు, గల్లీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కారణం లేకుండా గుమిగూడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న యువకులను సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, SI B జ్ఞానేశ్వర్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువకులు, వారి తల్లిదండ్రులకు అర్ధరాత్రి వేళ బయట తిరగడం వల్ల కలిగే అనర్థాలు, సామాజిక బాధ్యతలు, భవిష్యత్తు గురించి అవగాహన కల్పించారు.
అనంతరం యువకుల వివరాలు నమోదు చేసుకుని హెచ్చరికలతో తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘ఆపరేషన్ ఛబుత్ర’ నిరంతరం కొనసాగుతుందని, తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని SI జ్ఞానేశ్వర్ సూచించారు.
