Hyderabad: పైసా పైసా కూడబెట్టి, జీవితకాల కష్టాన్ని ధారపోసి సొంతింటి కల నెరవేర్చుకుందామని నమ్మి వస్తే.. ఎల్బీ నగర్‌లోని వాసవి ఆనంద నిలయం యాజమాన్యం తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం నాటి వాసవి ఆనంద నిలయం కస్టమర్ల సమావేశంలో సంస్థ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఏళ్ల తరబడి ప్లాట్లు/ఇళ్లు అప్పగించకుండా కాలయాపన చేస్తోన్న యాజమాన్యం.. ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ అంటూ సరికొత్త ప్లాన్లు చెబుతోందని కస్టమర్లు మండిపడ్డారు.
ఈ సమావేశంలో సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొని, త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని, తమకు రూ. 1000 కోట్ల రుణం కూడా లభించిందని కస్టమర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిసారి ఇలాంటి మాటలు చెప్పి దాటవేయడమే తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదని బాధితులు స్పష్టం చేశారు. రూ. 1000 కోట్ల రుణం వచ్చిందని చెబుతున్న వాసవి సంస్థ.. ఆ నిధులను ఈ ప్రాజెక్ట్‌కే ఉపయోగిస్తుందని, వేరే ఇతర ప్రాజెక్టులకు మళ్లించదని గ్యారంటీ ఏమిటని నిలదీశారు. గతంలో ఇచ్చిన మాటలనే నిలబెట్టుకోని యాజమాన్యాన్ని ఇప్పుడు ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఏళ్లుగా ప్లాట్ రాక, కట్టిన డబ్బులు తిరిగి రాక తీవ్ర మానసిక ఆందోళనతో అనారోగ్యం పాలవుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. “మా కష్టార్జితంతో ఆటలాడొద్దు.. మా ప్రాణాలు తీయొద్దు. మాకు ఇళ్లయినా కట్టి ఇవ్వండి, లేదా మేము కట్టిన సొమ్మును వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయండి” అని కస్టమర్లు డిమాండ్ చేశారు.
వందల కోట్లు వసూలు చేసి, ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా ముప్ప తిప్పలు పెడుతున్న వాసవి ఆనంద నిలయం వైఖరిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, తెలంగాణ రెంరా (RERA) అధికారులు తక్షణమే స్పందించి వాసవి సంస్థ ప్రాజెక్టుపై సమీక్ష జరిపి, తమకు న్యాయం జరిగేలా చూడాలని కస్టమర్లు కోరుతున్నారు.
