ఆశగా తిన్న మండి బిర్యానీ.. నిండు ప్రాణాన్ని బలిగొన్న ఫుడ్ పాయిజన్!

Mandi Biryani

Mandi Biryani

Mandi Biryani: రుచికరమైన ఆహారం కోసం ఆశగా వెళ్లిన ఆ యువకుడిని మండి బిర్యానీ బలి తీసుకుంది. అధికారులు ఎన్ని తనిఖీలు చేపడుతున్నా, దాడులు నిర్వహిస్తున్నా హోటళ్ల నిర్వాహకుల వ్యాపార దాహం మనుషుల ప్రాణాలనే తీసేస్తోంది. వారి నిర్లక్ష్యం, నిల్వ ఉంచిన నాసిరకం ఆహార విక్రయాలు అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

నర్సాపూర్ పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో మండి బిర్యానీ తిన్న సుమారు 15 మంది కస్టమర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి భోజనం చేసిన మరుసటి రోజు ఉదయం నుంచే వారిలో తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పిట్ల సాయిరామ్ (19) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మిగిలిన 14 మంది బాధితులు నర్సాపూర్, దౌలతాబాద్, సంగారెడ్డిలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మండి బిర్యానీలో కలుషిత ఆహారం లేదా నిల్వ ఉంచిన పదార్థాలు వాడటం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని బాధితులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న కష్టజీవి కుటుంబానికి చెందిన యువకుడు సాయిరాం మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.