డూప్లికేట్ రాజ్యమేలుతోంది.. మన బతుకులు బందీ అవుతున్నాయి!

Fake Products

Fake Products

Fake Products:  ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితం నకిలీల నడుమ కొట్టుమిట్టాడుతోంది. తినే తిండి, తాగే పాలు, వాడే మందులు, ఆఖరికి పసిపిల్లలు తాగే ఆహారం వరకు అంతటా ‘దో నంబర్ దందా’ రాజ్యమేలుతోంది. అధిక లాభాల కోసం కల్తీ రాయుళ్లు నాసిరకం పదార్థాలతో మార్కెట్లను నింపేస్తున్నారు. సామాన్యుడు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేస్తున్న ప్రతీ వస్తువులో విషం దాగి ఉంటోంది. నిత్యం జరుగుతున్న ఈ మోసాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్న వ్యవస్థలు, కేవలం మామూళ్లకు అలవాటుపడి మిన్నకుండిపోతుండటం దారుణం.

అంతా డూప్లికేట్ మయం

పాలలో యూరియా, డిటర్జెంట్.. కారం పొడిలో ఇటుక పొడి.. మసాలా దినుసుల్లో రసాయనాలు, రంగులు.. ఇలా ప్రతీదీ కల్తీమయమే. ఆఖరికి ప్రముఖ బ్రాండ్ల పేరుతో డూప్లికేట్ ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. వీటిని తిని ప్రజలు క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొనే మందులు కూడా నకిలీవే వస్తుంటే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి?

వ్యవస్థల నిద్రమత్తు.. పెరిగిన అరాచకం

పర్యవేక్షణ చేయాల్సిన తనిఖీ అధికారులు కేవలం పండుగల వేళ లేదా ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. శాశ్వత చర్యలు, క్రిమినల్ కేసులు లేకపోవడంతో కల్తీ మాఫియా ఏమాత్రం భయం లేకుండా చెలరేగిపోతోంది. లంచాలకు లొంగి ప్రజల ప్రాణాలను వ్యాపారుల చేతుల్లో బలిపెడుతున్నారు.

జనంలో రావాలి చైతన్య విప్లవం

ఈ నకిలీ రాక్షసుడిని అంతం చేయాలంటే చట్టాలతో పాటు ప్రజాచైతన్యం అత్యంత అవసరం. తక్కువ ధరకే వస్తుందని నాసిరకం ఉత్పత్తులను నమ్మి మోసపోవద్దు. వస్తువు కొనేముందు ఐఎస్‌ఐ, ఎఫ్‌ఎస్ఎస్ఏఐ గుర్తులను గమనించడం, బిల్లులను తప్పనిసరిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కల్తీ అని అనుమానం వస్తే వెంటనే ఆహార భద్రత అధికారులకు, వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేయాలి. ప్రశ్నించే హక్కును వాడుకున్నప్పుడే ఈ ‘దో నంబర్ దందా’కు అడ్డుకట్ట పడుతుంది.