Martyrs Colony: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో ఉన్న భూముల సమగ్ర సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. సర్వే నంబర్ 325లోని మొత్తం 388 ఎకరాల భూమికి గాను, ఇటీవలే రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే రికార్డుల్లో తేలింది.
దీంతో మిస్సయిన 45 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో తక్షణమే లెక్క తేల్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ భూమి పొరుగునే ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఫామ్‌హౌస్ సరిహద్దుల్లో ఉండటంతో.. వారి సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. భూములను కచ్చితంగా సరిచూసేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో రీ-సర్వే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
కాగా, సర్వే నంబర్ 325లోని భూమిలో స్థానిక అర్హులైన రైతులకు భూపంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాల కోసం అక్కడ భారీ “తెలంగాణ అమరవీరుల కాలనీ” నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరుల కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, మోడల్ కాలనీగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దే బాధ్యతను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించారు. ఈ నిర్మాణ పనులన్నింటినీ రాబోయే జూన్ 2వ తేదీ (తెలంగాణ అవతరణ దినోత్సవం) నాటికి పూర్తి చేసి బాధితులకు అందజేయాలని అధికారులను సూచించారు.
