CEC Resignation: ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఆర్ఆర్) ప్రక్రియ, ఓట్ల తొలగింపు వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష కూటమి (ఇండియా కూటమి) ఎంపీలు ఢిల్లీ వేదికగా భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వైపు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు విపక్ష కూటమికి చెందిన కీలక ఎంపీలందరూ పాల్గొన్నారు.
ర్యాలీగా బయలుదేరిన ఎంపీలను పార్లమెంట్ స్ట్రీట్‌లోని నీతి ఆయోగ్ భవన్ – ఆకాశవాణి భవన్ మధ్యలో ఢిల్లీ పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. ముందుకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, రోడ్డుపైనే బైఠాయించి కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో బారికేడ్లు దాటి ముందుకు వెళ్లేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు విపక్ష అగ్రనేతలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదుల అక్రమ అరెస్ట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియను కోరడం నేరమా అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఆందోళన దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)కు చెందిన సుమారు 4,000 మంది బలగాలను రంగంలోకి దించి, ముళ్లకంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. “జ్ఞానేశ్.. ఆట ముగిసింది బ్రో, ఇక రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ దిగివచ్చే వరకు దేశవ్యాప్తంగా తమ పోరాటం ఆగదని, ఈ నెల 8 వరకు జిల్లా స్థాయిలో పాదయాత్రలు, ఆందోళనలు కొనసాగిస్తామని విపక్ష నేతలు స్పష్టం చేశారు.
