ఆపరేషన్ ఫైర్‌వాల్.. పాకిస్థాన్ హనీట్రాప్ గుట్టు రట్టు చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్!

Pakistan Spy

Pakistan Spy

Pakistan Spy: ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తున్న పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్థాన్ పన్నిన ‘హనీట్రాప్’ వలలో చిక్కుకుని, దేశ రక్షణ రంగానికి చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని శత్రుదేశానికి చేరవేస్తున్న సంచలనాత్మక విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం వెలుగులోకి తెచ్చింది. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’ పేరిట నిర్వహించిన ఈ రహస్య ఆపరేషన్ ద్వారా అంతర్రాష్ట్ర స్పై నెట్‌వర్క్ అక్రమ బాగోతాన్ని అధికారులు రట్టు చేశారు.

కోయంబత్తూరులో నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీ అరెస్టుతో ఈ దర్యాప్తునకు పునాది పడింది. ఆ తర్వాత ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన 12 ప్రత్యేక బృందాలు ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో మొత్తం 18 మందితో కూడిన పాకిస్థాన్ గూఢచర్య నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 13 మంది భారత నావికాదళానికి (Navy) చెందిన సిబ్బంది సస్పెన్స్‌లో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా విశాఖపట్నంలోని నేవీ స్థావరాలు, వివిధ రక్షణ సంస్థల సమాచారమే లక్ష్యంగా ఈ గుఢచర్యం సాగినట్లు అధికారులు ధృవీకరించారు.

ఈ కేసులో కీలక అనుమానితుడైన కాంట్రాక్ట్ డ్రైవర్ సాయి వరప్రసాద్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయగా, విశాఖపట్నం జిల్లా కోర్టు అతనికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మరోవైపు కోయంబత్తూరులో అదుపులోకి తీసుకున్న నేవీ ఉద్యోగి ప్రదీప్ ముఖర్జీని కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు. మిగిలిన 16 మంది పాత్రపైనా దర్యాప్తు ముమ్మరం చేశారు.

అనుమానితులంతా అత్యంత భద్రత కలిగిన ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా భారత సైనిక సమాచారాన్ని పాకిస్థాన్‌లోని ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తనిఖీల సందర్భంగా అనుమానితుల వద్ద నుంచి భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ భద్రతకే సవాలుగా మారిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.