Navaratri Alankaram: నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు భక్తులకు ‘కాళరాత్రి’ అలంకారంలో దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, శిక్షణలో భాగంగా అమ్మవారు ధరించిన ఈ భీకరమైన, అదే సమయంలో భక్తులపట్ల కరుణను కురిపించే ఈ రూపం విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంది. ఆదిశక్తి స్వరూపిణి అయిన కాళరాత్రి దేవిని దర్శించుకోవడం ద్వారా సకల భయాలు తొలగిపోతాయని, భక్తులకు అభయం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన వేడుకను కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది.
శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు… బిల్వాదళాలతో అర్చన
ఏడో రోజు వేకువజామునే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీరిన కాళరాత్రి అలంకారంలోని భ్రమరాంబికా దేవికి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు, ప్రత్యేక పూలతో అలంకరణ చేశారు. పవిత్రమైన బిల్వాదళాలతో అమ్మవారిని అర్చిస్తూ వేద పండితులు జరిపిన పూజలు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా చేశాయి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మంగళ హారతులు ఇచ్చారు. ఈ విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి దివ్యరూపాన్ని కనులారా వీక్షించి తరించారు.
గజవాహనంపై స్వామి అమ్మవార్ల దివ్య గ్రామోత్సవం
ప్రత్యేక పూజల అనంతరం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను అత్యంత సుందరంగా అలంకరించిన గజవాహనంపై ఆశీనులను చేశారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించిన తర్వాత, అంగరంగ వైభవంగా గ్రామోత్సవ వేడుక ప్రారంభమైంది. ఆలయం వెలుపల బాజా బజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తుల గ్రామోత్సవం సాగింది. దారి పొడవునా భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. క్షేత్ర వీధుల్లో సాగిన ఈ దివ్య ఘట్టం భక్తులలో పారవశ్యాన్ని నింపింది.
జానపద కళారూపాల విన్యాసాలు… అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
గ్రామోత్సవ వేడుకను మరింత కనువిందు చేసేలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవ మూర్తుల ముందు సాగిన కోలాటాలు, నాదస్వరం, కేరళ చండీ మేళం, కొమ్ము కోయ నృత్యం, రాజభటుల వేషధారణలు, చెక్క భజనలు, సాంప్రదాయ విళకు నృత్యాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయ కళల జోరుతో శ్రీశైల వీధులు పులకించిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాలుపంచుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
