తుమ్మిడిహెట్టికి లైన్‌క్లియర్! మహారాష్ట్రతో చర్చలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

Tummidihetti Barrage

Tummidihetti Barrage

Tummidihetti Barrage: తెలంగాణలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు జీవం పోసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రం (MCRHRD) బోధి పెవిలియన్‌లో నీటిపారుదల (ఇరిగేషన్) శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, దిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో ప్రాధాన్యత కలిగిన నిర్ణయం తీసుకున్నారు. 152 మీటర్ల ఎత్తున ఈ బ్యారేజీని నిర్మిస్తే లభ్యమయ్యే నీటి వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ క్రమంలో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే చర్చలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. చర్చల కోసం త్వరలోనే ఆహ్వానిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

దీంతో పాటు దిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆదేశించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ఒక టీఎంసీ, ఏదుల రిజర్వాయర్‌కు అదనంగా 0.6 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులకు  సంబంధించిన పంప్ హౌస్‌లు, పంపుల ఏర్పాటు పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు తేల్చిచెప్పారు.