తరుముకొస్తున్న ఎల్‌నినో.. పేదలకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు

Telangana Govt

Telangana Govt

Telangana Govt: రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, వర్షాభావం కారణంగా తలెత్తే కరవు ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో రంగాంలోకి దిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్త నిర్వహణలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కరవు ఛాయలు అలముకోకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని  మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు జాబ్ కార్డులు లేని అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి తక్షణమే కొత్త కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఈ జాబ్ కార్డుల్లో చేర్చాలని స్పష్టం చేసింది. సాధారణంగా ఇచ్చే రోజులకు అదనంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పాటు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఈ నిర్ణయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో వేగవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కరవు పరిస్థితుల వల్ల ఏ ఒక్క పేద, గిరిజన కుటుంబం ఇబ్బంది పడకుండా యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించేలా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని సీఎం ఆదేశించారు.