చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా? కరవు పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ ఫైర్‌!

Harish Rao

Harish Rao

Harish Rao:  అసమర్థుడికి అధికారం అప్పగిస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా రేవంత్ రెడ్డి పాలన తయారైందని, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్ల వచ్చినవేనని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరవు వస్తోందని, నీళ్లను ఎత్తిపోయడం తమ వల్ల కాదని ముందే చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. ప్రభుత్వం కరవు నివారణ చర్యలు చేపట్టకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనని ఆక్షేపించారు.

ఆరు నెలలుగా ఎల్‌నినో ప్రభావం గురించి తెలుసని చెబుతున్న ప్రభుత్వం.. మరి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయలేదని, రిజర్వాయర్లలో నిల్వలను ఎందుకు పెంచలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నీరు గలగలపారుతుంటే, తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ఎందుకు వెలవెలబోతున్నాయో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ హయాంలో కరవు రాకుండా ముందస్తు ప్రణాళికలతో నీటిని ఒడిసిపట్టి, ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండుతుంటే, రైతులు ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటున్న గోస ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిట్టినంత మాత్రాన ప్రాజెక్టులలో నీళ్లు పెరగవని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు పక్కనపెట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలు, తాగునీరు, సాగునీటి పరిస్థితి, కరవు నివారణ నిధులపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరవును ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణను ప్రకటించి, నష్టపోయిన రైతులకు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాలని, రైతు బీమా, పంటల బీమా పథకాలను వెంటనే అమలు చేసి ప్రజలకు అండగా నిలవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.