ఫామ్‌హౌస్ పార్టీలకు చెక్! చేవెళ్లలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాల స్పెషల్ డ్రైవ్

Chevella Farmhouse

Chevella Farmhouse

Chevella Farmhouse: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఫామ్‌హౌస్‌లు వేడుకలకే కాకుండా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న సమాచారంతో పోలీసులు రాత్రికి రాత్రే రంగంలోకి దిగారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫామ్‌హౌస్‌లపై ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు స్థానిక ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా ఈ భారీ కార్డన్ అండ్ సెర్చ్ శైలి తనిఖీలను చేపట్టారు.

47 ఫామ్‌హౌస్‌లలో జల్లెడ.. ముడిమ్యాల్‌లో బయటపడ్డ నిర్వాకం

చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేరుగా ఇచ్చిన ఆదేశాలతో సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు చేవెళ్ల ప్రాంతంలోని మొత్తం 47 ఫామ్‌హౌస్‌లను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ముడిమ్యాల్ గ్రామంలోని ‘ఎలైట్ ఫామ్‌హౌస్’ (Elite Farm House) లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నడుపుతున్న హుక్కా సెటప్‌ను పోలీసులు కనుగొన్నారు. వీకెండ్ల వేళ ఫామ్‌హౌస్‌ల పేరుతో నిర్వహించే రాత్రి పార్టీలు, ఈవెంట్లు, ఇతర అనుమానాస్పద వేడుకలపైనే ప్రధానంగా ఈ ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.

నిబంధనలు దాటితే కఠిన చర్యలు: డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరిక

ఫామ్‌హౌస్ యజమానులు కేవలం అద్దె రాబడి చూసుకోవడమే కాకుండా, తమ ప్రాంగణాల్లో ఎలాంటి చట్టవ్యతిరేక పనులు జరగకుండా బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు సైతం డీజే, మద్యం, ఇతర పార్టీల నిర్వహణలో పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, అక్రమ కార్యకలాపాలకు ఆశ్రయం కల్పించినా కేవలం ఈవెంట్ నిర్వాహకులపైనే కాక, సంబంధిత ఫామ్‌హౌస్ యజమానులపై కూడా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని అధికారులు తేల్చిచెప్పారు.

రాబోయే రోజుల్లోనూ కొనసాగనున్న నిఘా

నగర శివార్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రైవేట్ వేడుకలు, అక్రమ మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి ఇలాంటి మెరుపు తనిఖీలు ఇకపై కూడా నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే తమ ప్రాథమ్యం అని తెలిపారు. పోలీసుల ఈ ఆకస్మిక చర్యతో నిబంధనలు ఉల్లంఘించే ఫామ్‌హౌస్ యజమానులు, ఈవెంట్ ఆర్గనైజర్లలో వణుకు మొదలైంది.