అంతరిక్షంలో అడుగులు.. మ్యాన్‌హోల్‌లోనే బతుకులు!

Sanitation Workers

Sanitation Workers

Sanitation Workers: ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధనలు.. ఇలా సాంకేతికంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కానీ, మానవ మనుగడకు అత్యంత కీలకమైన పారిశుద్ధ్య రంగంలో మాత్రం కార్మికుల జీవితాలు ఇంకా చీకటి గుహల్లోనే బందీగా ఉన్నాయి. నడిరోడ్డుపై చిన్న బురద గుంటలో కాలు పడితేనే అసహ్యంతో ముక్కు మూసుకునే నాగరిక సమాజంలో, ఓ కార్మికుడు నేరుగా డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో దిగి మురికిని చేతులతో ఎత్తిపోస్తున్న దృశ్యం తీవ్రంగా కలచివేస్తోంది. కనీస సురక్షిత పరికరాలు, ఆధునిక యంత్రాలు లేకుండా నడిరోడ్డుపై మ్యాన్‌హోల్‌లోకి దిగి మురుగును శుభ్రం చేయడం నిజంగా బాధాకరం. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటివి కొనసాగడం అత్యంత విషాదకరం.

పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సమాజం ఒక్కరోజు కూడా నిలవలేదు. అలాంటిది వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి అమానవీయ పనులు చేయించడం మానవత్వానికే మచ్చ. చట్టాలు నిరోధిస్తున్నా, యంత్రాల ద్వారా శుభ్రం చేయాలనే నిబంధనలు ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం పాలకుల అలసత్వానికి నిదర్శనం. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి, పారిశుద్ధ్య పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రాలను వినియోగించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆక్రోశిస్తున్నాయి.