తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ అప్.. మహారాష్ట్రతో చర్చలకు బిగ్ ప్లాన్!

Tummidihetti Barrage

Tummidihetti Barrage

Tummidihetti Barrage: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మక తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నీటిపారుదల శాఖ అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు వివరాలు, గతంలో కుదిరిన ఒప్పందాలు, ఇతర కీలక అంశాలపై అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల జరిపిన చర్చలు, ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు, సంబంధిత పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి సత్వరమే అందజేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను రెండు రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలో (జాయింట్ అకౌంట్) జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భూముల ముంపునకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సర్వే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని, ఇరు రాష్ట్రాల చర్చల్లో ఎలాంటి ఆలస్యం లేదా జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.