రాప్తాడు ఘటన.. నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. జీజీహెచ్‌ వైద్యుల ప్రకటన!

Crime News

Crime News

Crime News: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన ఉన్మాది హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. మోకాలి పైవరకు కాలును అంఫ్యుటేషన్ (తొలగించడం) చేసినట్లు అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి అధికారికంగా వెల్లడించారు.

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అతని కుడి కాలుకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయి కుళ్ళిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి మోకాలి పైవరకు కాలును తొలగించింది. అలాగే ఎడమ కాలికి సంబంధించిన రక్తనాళాలు కూడా దెబ్బతినడంతో ఆ కాలికి కూడా సర్జరీ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీకి తరలించి వైద్యం అందిస్తున్నామని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు.

ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునే క్రమంలో సీఐ వెంకటేశ్‌పై హేమంత్ దాడికి యత్నించడంతో పోలీసులు తొలుత గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగడంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి బంధించిన విషయం తెలిసిందే.