తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు.. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా!

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు సంక్షేమ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం నుంచి ప్రజారోగ్యం, భద్రత, న్యాయ వ్యవస్థ బలోపేతం వరకు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ల విభజన:

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, ఆ రెండు వర్గాలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 2003 నాటి చట్టాన్ని రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రతి కమిషన్‌లో ఒక ఛైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారని, ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు వేగంగా పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా:

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా కల్పించే పథకాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయి. అలాగే ఇప్పటికే పూర్తయిన 2,25,000 ఇందిరమ్మ ఇళ్లలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నవంబర్ 9న కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ రైతు బహిరంగ సభ జరగనుంది.

కీలక చట్టాల సవరణలు – కొత్త ఉద్యోగాల మంజూరు:

అగ్నిప్రమాదాల నివారణ, త్వరిత స్పందనకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్-1999 సవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923 లోని సెక్షన్ 12(ఏ) ను సవరిస్తూ, నోటీసులపై అప్పీల్ కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించింది. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని కొత్త, అదనపు కోర్టుల కోసం మొత్తం 136 కొత్త పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.