ఈ-బుక్స్ చదివితే డబ్బులంటూ గాలం.!
ఏకంగా రూ. 1.25 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు
కేరళలో వెలుగుచూసిన ఆన్‌లైన్ మోసం
‘NTL App’ నమ్మి రోడ్డున పడ్డ వందలాది బాధితులు
మినిట్ 2 మినిట్, తిరువనంతపురం (ఆగస్ట్ 31): ఈజీ మనీ పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షమయ్యే ఆకర్షణీయ ఆఫర్లను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా కేరళలో ‘ఈ-బుక్స్ చదివితే చాలు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు’ అంటూ సైబర్ కేటుగాళ్లు ఏకంగా వంద మందికి పైగా అమాయకులకు వల వేసి రూ. 1.25 కోట్లకు పైగా కొల్లగొట్టారు. బాధితులు తిరువనంతపురం రూరల్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించడంతో ఈ పెద్ద కుంభకోణం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసగాళ్లు ‘NTL App’ పేరుతో ఒక కొత్త యాప్ ద్వారా ఈ స్కామ్‌ను నడిపారు. వాట్సాప్‌లో లింకులు పంపి యాప్‌లో సభ్యత్వం తీసుకోవాలని, ఈ-బుక్స్ చదివితే ఒక్కో పుస్తకానికి రూ. 25 చొప్పున ఇస్తామని నమ్మించారు. ఈ సభ్యత్వం పొందేందుకు ఒక్కొక్కరి వద్ద రూ. 1,800 ప్రారంభించి ఏకంగా లక్ష రూపాయల వరకు ఫీజుల రూపంలో వసూలు తెలిపారు. అంతేకాకుండా కొత్తవారిని జాయిన్ జరిపిస్తే అదనంగా కమీషన్ కూడా వస్తుందని చెప్పడంతో బాధితులు తమ బంధువులు, ఆత్మీయులను సైతం ఈ యాప్‌లో జాయిన్ జరిపించారు.
ప్రారంభంలో నమ్మకం కలిగేందుకు వారానికోసారి కొద్ది మొత్తం సభ్యుల ఖాతాల్లో చెల్లించారు. యాప్‌లో చూపించిన రాబడి వర్చువల్ స్క్రీన్‌కే పరిమితం కాగా, ప్రతి బుధవారం విత్‌డ్రా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఎక్కువ సంఖ్యలో సభ్యులు జాయిన్ అయి భారీగా సొమ్ము వసూలైన తర్వాత ఒక్కసారిగా యాప్ నడవడం నిలిచిపోయింది. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో స్థానికుడు సనోఫర్ కీలక సూత్రధారి అని ఫిర్యాదులో పేర్కొన్నా, అతని వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్ హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
