ఆన్‌లైన్ బెట్టింగ్ డందాలపై గళం ఎత్తుదాం.. భయం వీడి పౌర బాధ్యత చాటుదాం!

Online Betting

Online Betting

Online Betting: గత కొద్ది రోజులుగా బెట్టింగ్ కేటుగాళ్ల కోట్ల మాయాజాలం, వారు కొన్న అక్రమ ఆస్తులపై చట్టం ఉక్కుపాదం మోపడం, అమాయక బాధితుల కుటుంబాల కన్నీళ్ల నిజాలను ‘మినిట్ 2 మినిట్’ వరుస కథనాల ద్వారా చూశాం. అయితే, ఈ మహమ్మారిని కేవలం వార్తలు రాయడం ద్వారానే కాకుండా ఆచరణలో తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. సమాజానికి పట్టిన ఈ బెట్టింగ్ మాయరోగాన్ని తుదముట్టించడంలో పౌరులు అందించే ఒక చిన్న రహస్య సమాచారం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపగలదు.

సమాచారం ఇచ్చేందుకు భయం వద్దు.!

చాలామంది పౌరులు తమ చుట్టూ బెట్టింగ్ ఏజెంట్లు, ఆటగాళ్లు సంచరిస్తున్నా, దందాలు నడుపుతున్నా పోలీసులకు లేదా పత్రికలకు చెప్పడానికి వెనుకాడతారు. కానీ నేటి చట్టాలు సమాజ శ్రేయస్సు కోరే పౌరులకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయి. మీరు అందించే ఆధారాలు, సమాచారం గురించి మీ ఇంట్లో వారికి కూడా తెలియకుండా పోలీసులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదుదారుల వివరాలు బయటకు రావు. స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. నేటి డిజిటల్ యుగంలో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా జాతీయ సైబర్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఇంటర్నెట్‌లో రహస్యంగా సమాచారం నమోదు చేయవచ్చు. మీ చిన్న క్లూ ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. మీ పరిధిలో నడుస్తున్న బెట్టింగ్ దందాపై మీరు ఇచ్చే ఒక్క చిన్న ఆధారమైనా.. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు సిద్ధమవుతున్న ఏదో ఒక అమాయక యువకుడి ప్రాణాన్ని, ఆ కుటుంబాన్ని కాపాడగలదు.

బెట్టింగ్ ఆనవాళ్లను ఎలా గుర్తుపట్టాలి?

మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి అనైతిక దందాలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలక విషయాలను గమనించవచ్చు. ఎలాంటి ఉద్యోగం లేదా వ్యాపారం లేకుండా ఉన్నట్టుండి విపరీతమైన నగదు మార్పిడి జరుపుతున్న వ్యక్తులు. రాత్రివేళల్లో యువతను గుంపులుగా చేర్చి ఆన్‌లైన్ ఐడీలు ఇస్తూ, బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న ఏజెంట్లు. కమిషన్ల ఆశ చూపి స్థానికులు, విద్యార్థులతో నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిపిస్తున్న ముఠాలు. ఈ అంశాలను మీరు గుర్తించినట్టు అయితే వెంటనే మీరు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

సామాజిక బాధ్యతతో ధైర్యంగా ముందుకు రండి!

సోషల్ మీడియాలో బెట్టింగ్ కేటుగాళ్లు సంపాదించే కోట్లను చూసి మోసపోవడం కాదు. వారి అసలు రంగు బయటపెట్టి చట్టానికి పట్టించడమే అసలైన పౌర బాధ్యత. మన ఊరు, మన ఏరియా బెట్టింగ్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మేల్కొనాలి. సమాజ హితం కోరి ధైర్యంగా ముందుకు వచ్చి బెట్టింగ్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ‘మినిట్ 2 మినిట్’ పిలుపునిస్తోంది.