Model Busstands: ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 5 వేల మందికి పైగా ప్రయాణికుల రద్దీ నమోదయ్యే 86 ప్రధాన బస్ స్టాండ్లను ‘మోడల్ బస్ స్టాండ్లు’గా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రయాణం సాఫీగా, సుఖమయంగా సాగేలా ఈ ప్రాంగణాల్లో ఆధునిక మార్పులు తీసుకురానున్నారు.
ఈ మోడల్ బస్ స్టాండ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థను గట్టిగా పెంచనున్నారు. ఏ బస్సు ఏ సమయానికి వస్తుంది, ఏ ప్లాట్‌ఫారమ్‌పై ఆగుతుందనే పూర్తి వివరాలతో నూతన డిజిటల్ టైమ్ టేబుల్ బోర్డులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల సలహాలు, సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఎంక్వైరీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వేళాపాళా లేని ప్రయాణాలకు ముగింపు పలుకుతూ ప్రతి బస్ స్టాండ్‌లో విధులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోలర్లను నియమించనున్నారు.
సమాచారాన్ని నిరంతరం స్పష్టంగా అందించడానికి ఆధునిక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకోనున్నారు. మొదటి బస్సు ఎప్పుడు బయలుదేరుతుంది, చివరి బస్సు ఏ సమయానికి అందుబాటులో ఉంటుందనే సమగ్ర సమాచారం వీటి ద్వారా నిరంతరం ప్రసారమవుతుంది. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా ఆర్టీసీ చేపడుతున్న ఈ చర్యలతో బస్ స్టేషన్లలో సరికొత్త మార్పులు రానున్నాయి.
