Renu Desai: పండుగ వేళ భారీ శబ్దాలతో కూడిన బాణసంచా కాల్చడంపై, దానివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు పడే ఇబ్బందులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నటి రేణు దేశాయ్‌పై కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమె చేసిన విజ్ఞప్తిని పక్కనపెట్టి, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కొందరు దారుణమైన కామెంట్లతో ట్రోలింగ్‌కు దిగారు. ఈ నెగెటివిటీపై రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి అత్యంత ఘాటుగా స్పందిస్తూ నిరసన తెలిపారు.
ఒక వ్యక్తి ఇప్పటికే కష్టంలో లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని మరింత వేధించడం నైతికంగా సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. కింద పడిపోయిన వారిని తొక్కడం అమానుషమని, హోదా ఏదైనా ప్రతీ ఒక్కరూ మనుషులేనని గుర్తుచేశారు. “ఒకరిని బాధపెడుతూ యూట్యూబర్లు, పత్రికలు సంపాదించే డబ్బు ఎవరో ఒకరి కన్నీళ్లతో మలినమై ఉంటుంది. ఆ కర్మ మొత్తం వంశాన్నే నాశనం చేస్తుంది” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనుషుల మధ్య దయ, సహానుభూతి అత్యంత ప్రాథమిక సూత్రాలని హితవు పలికారు.
గాజు మేడల్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయడం సరికాదని స్పష్టం చేసిన ఆమె, తన అభిప్రాయాలను నిష్పాక్షికంగా పంచుకున్నానని వెల్లడించారు. స్వార్థ ప్రయోజనాల కోసం లేదా డబ్బుల కోసం మాట్లాడే అలవాటు తనకు లేదని వివరణ ఇచ్చారు. సమాజాన్ని మరింత మెరుగ్గా మార్చాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని, అనవసరమైన ఊహాగానాలకు తావివ్వవద్దని కోరారు. నెట్టింట రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
