కబ్జాల చెర వీడి, కళకళలాడుతున్న తమ్మిడికుంట.. ప్రారంభించిన సీఎం రేవంత్, నాగార్జున

Thammidikunta Lake

Thammidikunta Lake

Thammidikunta Lake: మాదాపూర్ ఐటీ కారిడార్ పరిధిలో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన చారిత్రక తమ్మిడికుంట చెరువు నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. నవీకరించిన ఈ చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. ఈ అట్టహాస కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణకు పెద్ద మనసుతో సహకరించి, రెండు ఎకరాల స్థలాన్ని ధారాదత్తం చేసిన నాగార్జునను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో ప్రత్యేకంగా సత్కరించారు.

సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి సరస్సుల నగరంగా ఉన్న పాత వైభవాన్ని తిరిగి తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నీళ్ల నివాసాలను మనం ఆక్రమిస్తే అవి మన నివాసాలనే ఆక్రమిస్తాయని, వరదల నివారణకు చెరువుల పరిరక్షణ అత్యంత కీలకమని తెలిపారు. గతంలో ఆక్రమణల వల్ల 14 ఎకరాలకు తగ్గిపోయిన తమ్మిడికుంట చెరువును హైడ్రా యంత్రాంగం కృషి ద్వారా 30 ఎకరాలకు విస్తరించినట్లు వివరించారు. భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే గొప్ప కానుక ప్రకృతి అని, ప్రతి ఒక్కరూ చెరువుల సంరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, తమ్మిడికుంట చెరువును ఎంతో అందంగా తీర్చిదిద్దిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ, నగరంలో ఉన్న మిగతా చెరువులను కూడా ఇదే విధంగా పునరుద్ధరించాలని కోరారు. మనం మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి మంచి పర్యావరణమేనని పేర్కొన్నారు.

సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 30 వేల ట్రక్కుల పూడికను తొలగించి తీర్చిదిద్దిన ఈ చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల పొడవైన ఆహ్లాదకరమైన పాత్‌వే, అత్యాధునిక ఓపెన్ జిమ్, చిన్నారుల క్రీడా ప్రాంగణం, విరివిగా మొక్కలతో పచ్చదనాన్ని పెంపొందించారు. చెరువు అభివృద్ధి పనుల వివరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎంకు వివరించారు. ఇదే వేదికపై చెరువుల అభివృద్ధి పనుల వల్ల ఇండ్లు కోల్పోయిన 34 నిరుపేద కుటుంబాలకు సీఎం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఒకప్పుడు దుర్గంధంతో ఉన్న తమ్మిడికుంట చెరువు ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారడం పట్ల నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.