Online Betting: ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ భూతం ఇప్పుడు పల్లెలనూ కమ్మేస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయాధారిత ఆదాయాన్ని నిశ్శబ్దంగా మింగేస్తోంది. ఎండనక, వాననక పొలాల్లో చెమటోడ్చి కష్టపడే రైతు శ్రమను, వారి పిల్లలు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కొన్ని క్షణాల్లోనే తగలేస్తున్నారు. పల్లెల్లో సైలెంట్ కిల్లర్‌లా మారిన ఈ ఆన్లైన్ జూదం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుండగా, గ్రామీణ సమాజం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతోంది.
పంట నూర్పిడి పూర్తయ్యాక చేతికి వచ్చిన రాబడి, కౌలు రూపంలో వచ్చిన నగదు, పశువులను అమ్మగా వచ్చిన సొమ్ము ఇలా ఏ రూపంలో డబ్బులు ఇంట్లోకి వచ్చినా, అవి క్షణాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల పాలువుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమలో పడుతున్న గ్రామీణ యువత, తమ తండ్రుల కష్టాన్ని సైబర్ రొంపిలోకి నెట్టేస్తున్నారు. అప్పులు చేసి కొన్న విత్తనాలు, ఎరువుల బాకీలు తీర్చాల్సిన సమయంలో, పంట అమ్మకం డబ్బులు బెట్టింగ్‌లో మాయమవ్వడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోతున్నారు.
చితికిపోతున్న పల్లె జీవితాలు
ఈ బెట్టింగ్ మహమ్మారి కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా, ఊళ్లోని చిన్న వ్యాపారాలు, పరపతి సంఘాలు, స్థానిక ఆర్థిక చక్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం దాచుకున్న అత్యవసర నిధులు బెట్టింగ్ వ్యసనానికి ఆహుతవ్వడంతో, మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. ఆశతో మొదలై అప్పుల ఊబిగా మారే ఈ జూదం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గృహహింస, మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయి.
పల్లెలను పట్టిపీడిస్తున్న ఈ జూదపు జాడ్యాన్ని అరికట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి సంపాదించిన రూపాయిని సైబర్ వ్యాపారుల చేతుల్లో పోగొట్టుకోకుండా తమ పిల్లలకు సరైన దారి చూపించాల్సిన బాధ్యత గ్రామీణ తల్లిదండ్రులపై ఉంది.
