వాకర్ టౌన్ ‘పద్మారావు నగర్’గా ఎలా మారింది? ఆ మహనీయుడి అపురూప చరిత్ర ఇదే!

Padmarao Nagar

Padmarao Nagar

Padmarao Nagar:  సికింద్రాబాద్‌లోని అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన పద్మారావు నగర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. నిజాం కాలంలో గొప్ప దాతగా, ప్రముఖ పౌరుడిగా పేరుగాంచిన దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ స్మృత్యర్థం ఆనాటి వాకర్ టౌన్‌కు పద్మారావు నగర్‌గా నామకరణం చేశారు. ఆయన 151వ జయంతిని పురస్కరించుకుని పద్మారావు నగర్ పార్కులో పునరుద్ధరించిన ఆయన విగ్రహం, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశేషమేమిటంటే, సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే పార్కును తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించడం గమనార్హం.

1875 నవంబర్ 7న జన్మించిన పద్మారావు ముదలియార్ సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. సికింద్రాబాద్‌లో తొలి బాలికల పాఠశాల అయిన కీస్ హైస్కూల్ స్థాపనలో కీలక పాత్ర పోషించడంతో పాటు, మహబూబ్ కాలేజీ అధ్యక్షుడిగా, గౌరవ కార్యదర్శిగా 1918–1934 మధ్య సేవలందించారు. హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ, బాయ్స్ స్కౌట్స్ అండ్ గర్ల్ గైడ్స్ ఉద్యమం, డెక్కన్ క్లబ్, లేడీ బార్టన్ క్లబ్, ప్రుడెన్షియల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ స్థాపకుల్లో ఒకరిగా నిలిచారు.

1900వ దశకం ఆరంభంలో సికింద్రాబాద్‌లో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు, మద్రాస్ ద్వారా ఆహార ధాన్యాలను తెప్పించి పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన మహోన్నత మానవతావాది. ఆయన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆనాటి ప్రభుత్వం ‘దివాన్ బహదూర్’ బిరుదుతో సత్కరించింది. మారేడుపల్లి హౌసింగ్ సొసైటీ రూపకల్పనలోనూ ఆయన కృషి ఉంది. ఆయన వారసులు, పార్క్ అధ్యక్షుడు మామిడి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్ది, ఆ మహనీయుడి చరిత్రను భావితరాలకు అందించడం అభినందనీయం.