నాగోల్‌లో అదృశ్యాల కలకలం..వరుస మిస్సింగ్ కేసుల వెనుక అసలు మిస్టరీ ఏంటి?

Nagole Missing

Nagole Missing

Nagole Missing: ‘కనుబడుట లేదు’ అన్న మాటలు ఇప్పుడు నాగోల్ పరిసర ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారిపోయాయి. ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న అదృశ్య ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆత్మీయులు తిరిగి క్షేమంగా వస్తారో లేదో అని బిక్కుబిక్కుమంటూ కాలనీ వాసులు రోజులు వెళ్లదీస్తున్నారు. అసలు నాగోల్ ఠాణా పరిధిలో ఏం జరుగుతోంది? ఈ వరుస అదృశ్యాల వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏంటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది.

గత నెల అక్టోబర్ 31న సాయిరాం నగర్ ప్రాంతానికి చెందిన వరుణ్ తేజ్ (8), మహేశ్ (6) అనే ఇద్దరు చిన్నారులు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. పసివాళ్లు మాయమై రోజులు గడుస్తున్నా ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదు. కన్నబిడ్డల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆందోళనకు తెరపడేది ఎన్నడో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెబుతున్న పోలీసులు, చివరకు పిల్లల సమాచారం తెలిపిన వారికి రూ.20 వేల నజరానా ప్రకటించి సరిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ఇద్దరు బాలుర జాడ దొరకకముందే, తాజాగా నాగోల్ జైపురి కాలనీ రోడ్ నంబర్ 1లో నివాసముంటున్న సంపంగి సుగుణ (35), ఆమె పదిహేడేళ్ల కుమార్తె నందిని ఈ నెల 6వ తేదీ ఉదయం 8:30 గంటలకు అదృశ్యమయ్యారు. పనిచేస్తున్న ఇళ్లలో జీతం తెచ్చుకుంటానని భర్త సురేష్‌కు చెప్పి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు తిరిగి ఇంటికి చేరలేదు. భార్య, బిడ్డ కోసం భర్త పోలీసులను ఆశ్రయించినా, దర్యాప్తులో ఆశించిన వేగం కనిపించకపోవడంతో ఈ కేసు కూడా గత ఘటనల లాగే సాగతీత కథనంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లోనూ ఒకే ఠాణా పరిధిలో నలుగురు మాయమైతే ఛేదించలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నాగోల్ పోలీసులు ఈ మిస్టరీని త్వరగా కనిపెట్టి బాధితుల కన్నీళ్లు తుడుస్తారా, లేక చేతులెత్తేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.