kind worker: నగర జీవితమంటేనే ఉరుకులు, పరుగులు.. ఎవరి లోకంలో వారు మునిగిపోయి, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని యాంత్రిక జీవనం. అయితే, ఆ బిజీ ప్రపంచంలోనూ మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించే ఓ హృద్యమైన ఘటన ఎల్బీ నగర్లో చోటుచేసుకుంది. వాహనాల రద్దీతో నిత్యం కిటకిటలాడే ప్రధాన రహదారిపై ఓ అంధుడికి అండగా నిలిచిన పెట్రోల్ బంకు ఉద్యోగి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
రద్దీ రహదారిపై ఆపన్నహస్తం
ఎల్బీ నగర్లోని డీవీఎం డిగ్రీ కాలేజీ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై వాహనాలు వేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో, ఓ అంధుడు రోడ్డు దాటేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతూ బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయారు. వాహనాల హారన్ల శబ్దం, వేగంగా దూసుకొస్తున్న బండ్ల మధ్య అడుగు ముందుకు వేయలేక ఆయన పడుతున్న అవస్థను అక్కడే ఉన్న పెట్రోల్ బంకు ఉద్యోగి గమనించారు.
పనిని పక్కన పెట్టి.. మానవత్వాన్ని చాటి..
ఆ అంధుడి నిస్సహాయతను చూసిన ఆ చిరుద్యోగి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తాను చేస్తున్న పనిని వెంటనే పక్కన పెట్టి, పరుగున రోడ్డు మీదకు వచ్చారు. ఎంతో ఆప్యాయతతో ఆ అంధుడి చేయి పట్టుకుని, వస్తున్న వాహనాలను ఆపుతూ.. ఆయన్ను సురక్షితంగా అవతలి వైపునకు దాటించారు. కేవలం రోడ్డు దాటించడమే కాకుండా, ఆయన క్షేమంగా ముందుకు వెళ్లేలా భరోసా కల్పించి తిరిగి తన విధుల్లోకి వెళ్లిపోయారు.
అందరి హృదయాలను గెలుచుకున్న దృశ్యం
ఆస్తిపాస్తులు, హోదాలతో సంబంధం లేకుండా.. సాటి మనిషి కష్టాన్ని చూసి కరిగిపోయే మనసుంటే చాలు, ఎవరికైనా సాయం చేయవచ్చని ఈ చిరుద్యోగి నిరూపించారు. ఎలాంటి ప్రచారం ఆశించకుండా, నిస్వార్థంగా ఆయన చేసిన ఈ చిన్న సాయం అక్కడున్న వారందరినీ కదిలించింది. ఉరుకుల పరుగుల నగరంలో ఆగి మరీ తోటివారికి చేయూతనిచ్చిన ఈ అపురూప దృశ్యం ‘మినిట్ 2 మినిట్’ కెమెరా కంటికి చిక్కింది.
