సొంత గడ్డపై మళ్లీ క్రికెట్ పండగ.. 2031 వన్డే ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం!

World Cup

World Cup

World Cup: భారత క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీపి కబురు అందించింది. ప్రతిష్టాత్మక 2031 వన్డే ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీకి బంగ్లాదేశ్ సహ ఆతిథ్య దేశంగా వ్యవహరించనుంది. అంతేకాకుండా, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను కూడా ఐసీసీ భారత్‌కే అప్పగించడంతో స్వదేశీ మైదానాల్లో మరోసారి క్రికెట్ పండగ వాతావరణం నెలకొననుంది.

ఇండోనేసియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో 2035 వరకు జరగనున్న పురుషుల ప్రధాన క్రికెట్ టోర్నమెంట్ల క్యాలెండర్‌కు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం 2029 అక్టోబర్ 9 నుంచి 28 వరకు భారత్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండగా, 2031 అక్టోబర్ 9 నుంచి నవంబర్ 23 వరకు భారత్, బంగ్లాదేశ్ సంయుక్త ఆతిథ్యంలో వన్డే ప్రపంచ కప్ సమరం సాగనుంది.

ఇక ఇతర మెగా టోర్నీల వివరాలను పరిశీలిస్తే.. 2027లో జింబాబ్వే, నమీబియా వేదికలుగా వన్డే ప్రపంచ కప్, 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో టీ20 ప్రపంచ కప్ జరగనున్నాయి. 2030 టీ20 ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. అలాగే 2027, 2029, 2031 సంవత్సరాల్లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ వేదిక కానుంది. 2032 నుంచి 2035 మధ్య జరగనున్న టోర్నీల తేదీలను ఖరారు చేసిన ఐసీసీ, వాటి వేదికలను త్వరలోనే ప్రకటించనుంది.