Bomb Threat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియాన్ని పేలుళ్లతో కూల్చివేస్తామంటూ బుధవారం ఉదయం ఒక హెచ్చరిక ఈ-మెయిల్ అందింది. సరిగ్గా అదే సమయంలో స్టేడియంలో భారత్ అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరుగుతోంది. ఈ వార్త బయటకు పొక్కడంతో క్రికెట్ వర్గాలతో పాటు క్రీడాభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
పాపులర్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ కచేరీని టార్గెట్ చేస్తూ..
నవంబర్ 21న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రఖ్యాత పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకునే ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. తాము ఖలిస్థాన్ అనుకూల సంస్థకు చెందిన వాళ్లమని చెప్పుకున్న అగంతకులు, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాశారు. అంతేకాకుండా, దిల్జిత్ కార్యక్రమాలకు ఎవరూ హాజరుకావద్దని, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 1న జరగబోయే ఆయన షోను కూడా ఈ మెయిల్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు అందిన ఈ-మెయిల్
బుధవారం ఉదయం 10:52 గంటల ప్రాంతంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ఈ బెదిరింపు ఈ-మెయిల్ చేరింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఉదయం 11:15 గంటలకు మ్యాచ్ ముగియడంతో, ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఇరు జట్ల ఆటగాళ్లను, సిబ్బందిని సురక్షితంగా స్టేడియం నుంచి తరలించారు.
నగరవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో కలకలం
ఈ బెదిరింపులపై సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఏసీపీ (సైబర్ క్రైమ్) హార్దిక్ మకాడియా మాట్లాడుతూ.. బుధవారం ఒక్కరోజే అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు దాదాపు 13 ప్రాంతాలకు (పలు పాఠశాలలు మరియు ఇతర ప్రముఖ సంస్థలు) ఇలాంటి నకిలీ బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని తెలిపారు.
పూర్తిగా వదంతులే.. ఆందోళన చెందవద్దు
పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలు బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఇదొక ఫేక్ ఈ-మెయిల్ (వదంతు) అని అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ-మెయిల్ పంపిన సైబర్ కేటుగాళ్ల ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.
