అనరాని మాటలన్నారు.. కులం పేరుతో దూషించారు
కన్నీటిపర్యంతమైన కాంగ్రెస్ నేత బుడ్డ సత్యనారాయణ
జక్కిడి శివచరణ్ రెడ్డి కుటుంబంపై సంచలన ఆరోపణలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్
మినిట్ 2 మినిట్, ఎల్బీనగర్ (ఆగస్ట్ 08): కులం పేరుతో తీవ్రంగా అవమానించడమే కాకుండా ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు బుడ్డ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జ్ మధుయాష్కి గౌడ్ ప్రోత్సాహంతో తాను పార్టీలో ప్రజాసేవ చేస్తుంటే ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై, మహిళలపై అత్యంత నీచమైన పదజాలంతో బూతులు తిడుతూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. “ఎరుకల కులానికి చెందిన నాలాంటి వ్యక్తి రాజకీయంగా ఎదుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నంబర్ ప్లేట్ లేని కార్లతో గుద్ది చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంది” అని ఆరోపించారు.
అగ్రకుల అహంకారంతో ప్రవర్తిస్తూ రౌడీయిజం చేస్తున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కుల సంఘాల నాయకులతో కలిసి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ వినోద్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. లేనిపక్షంలో బహుజన, కుల సంఘాల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత నేతకు మద్దతుగా పలు సామాజిక వర్గాల ప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలీసు స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.
