అరబ్ ఎమిరేట్స్ విజన్!
గడ్డి మొలవని ఎడారి నుంచి గ్లోబల్ వండర్ వరకు!
ప్రకృతి సవాళ్లను దాటి సంపద సృష్టిస్తున్న అరబ్ దేశాల దూరదృష్టి
అమెరికా, కెనడా, భారత్ నుంచి భారీగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు
మౌలిక వసతులు, పచ్చదనం, ఆకాశహర్మ్యాల నిర్మాణంలో ప్రపంచానికే ఆదర్శం
మినిట్ 2 మినిట్, స్పెషల్ డెస్క్: ఎడారి అంటే ఒకప్పుడు ఇసుక తిన్నెలు, తాగునీటికి కష్టాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఈనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వైపు చూస్తే ప్రపంచమంతా నోరెళ్లబెడుతోంది. గడ్డి కూడా మొలవని చోట సంపద సృష్టిస్తూ, ప్రకృతితో పోటీ పడుతూ తమ దేశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు అరబ్ పాలకులు. కేవలం చమురు నిల్వలపైనే ఆధారపడకుండా, భవిష్యత్తును ముందుగానే ఊహించి టూరిజం, బిజినెస్ రంగానికి వేదికగా మార్చిన వారి దూరదృష్టిని చూస్తుంటే “మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాం?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది.
పెట్టుబడుల స్వర్గధామం – పర్యాటక విప్లవం
గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో యుఏఈ అనుసరిస్తున్న వ్యూహాలు అమోఘం. అమెరికా, కెనడా, భారత్ వంటి అగ్రదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తూ మౌలిక వసతులను భారీగా విస్తరిస్తున్నారు. నమ్మశక్యం కాని ఆకాశహర్మ్యాలు, మానవ నిర్మిత దీవులు, ప్రకృతికి విరుద్ధంగా జలవనరుల సృష్టి, పచ్చదనంతో నిండిన రోడ్లు చూస్తే ఎవరైనా పరేషాన్ కావాల్సిందే. పర్యాటక రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభంగా మార్చిన తీరు ప్రపంచ దేశాలకు ఒక పాఠం.
మన పాలకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది!
మన దగ్గర అపారమైన సహజ వనరులు, జీవనదులు, సారవంతమైన భూములు ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో, దీర్ఘకాలిక ప్రణాళికల్లో వెనకబడిపోతున్నాం. అరబ్ పాలకులు ప్రదర్శిస్తున్న ‘రేపటి కోసం నేడే సిద్ధమవడం’ అనే సూత్రాన్ని మన పాలకులు వంటబట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ స్వార్థాలకు అతీతంగా, భావితరాల ప్రయోజనాలను మనస్సులో ఉంచుకుని దూరదృష్టితో అడుగులు వేస్తేనే మన దేశం కూడా ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అరబ్ దేశాల ప్రగతి వైపు చూసి ఆశ్చర్యపోవడమే కాదు… ఆ విజన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది!
