కాంగ్రెస్ పెద్దలకు బీఆర్‌ఎస్ లీగల్ వార్నింగ్.. ఫామ్‌హౌస్ వివాదంపై వేడెక్కిన రాజకీయం

Legal Notice

Legal Notice

Legal Notice: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్‌ఎస్ లీగల్ సెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది.

బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులను పంపించారు. కొండపోచమ్మ సాగర్ అంశంపై ఇప్పటికే వెలుగు దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించాలని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసింది.

ఈ లీగల్ నోటీసులకు తక్షణమే స్పందించని పక్షంలో పరువు నష్టం దావాతో పాటు చట్ట ప్రకారం తదుపరి తీవ్ర న్యాయపరమైన చర్యలు చేపడతామని నోటీసుల్లో స్పష్టం చేశారు. రాజకీయా లబ్ధి కోసం మాజీ సీఎంపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.