Septic Tank: అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలోకి అడుగుపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న సమాజంలో.. ఇప్పటికీ మనిషితో మనిషి మలినాలను శుభ్రం చేయించడం అత్యంత అమానుషం. పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినం రోజే హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు యువకులు ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.
పొట్టకూటి కోసం ప్రాణాలు పణంగా..
మధ్యాహ్నం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన సుమన్ (24), సురేష్ (25), పవన్ (25) విషవాయువులు పీల్చి ఊపిరాడక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కనీస భద్రతా ప్రమాణాలు, రక్షణ కవచాలు లేకుండా కార్మికులను ట్యాంక్‌లోకి దించిన నిర్వాహకులు, అపార్ట్మెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎందుకు వాడటం లేదు?
ఇంకెన్నాళ్లిలా పొట్టకూటి కోసం సామాన్యుడు, పేద కార్మికుడు విషవాయువుల గుంతల్లో బలి కావాలి? మ్యాన్‌హోళ్లు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేయడానికి నేడు అత్యాధునిక యంత్రాలు, రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. మాన్యువల్ స్కావెంజింగ్ను నిషేధిస్తూ కఠిన చట్టాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఖర్చుకు వెనుకాడో, నిర్లక్ష్యంతోనో యంత్రాలను వాడకుండా పేద కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ముగ్గురు యువకులు పాతికేళ్ల వయసులోనే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి చోటా ఆధునిక సాంకేతికతను తప్పనిసరి చేసి, ఇలాంటి అమానుష మరణాలకు శాశ్వతంగా తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
