Indiramma Towers: హైదరాబాద్‌లోని పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ టవర్స్’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల విలువైన ఆస్తిని అందించడంతో పాటు, వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
ప్రతి దశలోనూ పారదర్శకత.. రెరా పరిధిలోకి ప్రాజెక్టు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్లు అప్పగించే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) గుర్తింపు లభించడం ఒక కీలక ముందడుగు అని తెలిపారు. ఒక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదు కావడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రెరా రిజిస్ట్రేషన్ వల్ల నిర్మాణంలో జాప్యం జరిగినా, నిబంధనలు ఉల్లంఘించినా లబ్ధిదారులు నేరుగా రెరాకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, నిర్లక్ష్యం వహించే బిల్డర్లకు నోటీసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు ఇవే
క్యూఆర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తుండగా, ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో 4 టవర్ల చొప్పున, ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు కలిపి మొత్తం 480 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ. 11 లక్షలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ. 5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. మిగతా రూ. 6 లక్షలను లబ్ధిదారులు నాలుగు విడతల్లో చెల్లించాలి. శంకుస్థాపన జరిగిన ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి అర్హులకు ఇళ్లు అప్పగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ రెరా అనుమతి పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్, రెరా చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి అందుకున్నారు.
