174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్.. కెప్టెన్ స్మిత్‌ సాహసానికి ప్రధాని మోదీ ప్రశంసలు!

Captain Smith

Captain Smith

Captain Smith: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేసిన ప్రాణాంతక దాడిని ఎదుర్కొని, సుమారు 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఫోన్‌లో మాట్లాడారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రధాని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ.. గురువారమే కెప్టెన్ స్మిత్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్.. కాక్‌పిట్‌లో జరిగిన భయానక ఘటనను ప్రధానికి వివరించారు.

నిలకడగా కెప్టెన్ స్మిత్ ఆరోగ్యం – ఆసుపత్రిలో పరామర్శించిన భారత రాయబారి:
యూఏఈలోని ఆసుపత్రిలో కోలుకుంటున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నిలకడగా ఉందని, ఆయన ఉల్లాసంగా ఉన్నారని యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ వెెల్లడించారు. ఆసుపత్రిని సందర్శించి స్మిత్ కుటుంబాన్ని పరామర్శించిన రాయబారి.. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందుతోందని, యూఏఈ అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు.

సౌదీ అరేబియా నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి తరలించిన స్మిత్.. పెను విషాదాన్ని నివారించి దేశం గర్వించదగ్గ రీతిలో వ్యవహరించారని రాయబారి కొనియాడారు.