Chandrababu Naidu: సాంకేతిక విప్లవాన్ని, టెక్నాలజీ వేగాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన, భవిష్యత్ సాంకేతికత, ఆర్థిక ప్రగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, దానిని అందిపుచ్చుకుని ముందుకు సాగడమే తెలివైన పని అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐ రాకతో సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న కొన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నప్పటికీ, అంతకంటే రెట్టింపు స్థాయిలో సరికొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో విశాఖపట్నానికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విశాఖ నగరం దేశంలోనే అత్యంత కీలకమైన ‘రేర్ ఎర్త్ మినరల్స్ సిటీ’గా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా కేవలం సంపద సృష్టించడమే కాకుండా, ఆ అభివృద్ధి ఫలాలను సమాజంలోని పేదలందరికీ సమానంగా అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం సీట్లు గెలుచుకుని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని సీఎం గుర్తుచేశారు.
