హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ‘ఇందిరమ్మ బీమా’తో కుటుంబానికి రూ. 5 లక్షల భరోసా!

Indiramma Bima

Indiramma Bima

Indiramma Bima: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (ఐకేజేపీబీ) అమలుపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ఫలాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలతో కలిసి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఎవరికి వర్తిస్తుంది? నమోదు ఎలా?

ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా లభించనుంది. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. ఇందుకోసం నిర్దేశిత వార్డులు, కాలనీల్లో ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినంత మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్ప్‌డెస్క్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

పారదర్శకంగా డేటా నమోదు

అర్హతలు, సమర్పించాల్సిన పత్రాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ముఖ్యంగా దివ్యాంగులు, బలహీన వర్గాలకు నమోదు సమయంలో ప్రత్యేక సహాయం అందించాలని కమిషనర్ సూచించారు. ఒకే వ్యక్తి పేరుతో డూప్లికేట్ నమోదు కాకుండా కుటుంబ, నామినీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తూ నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.