మాయాజాలంలో యువత.. అదృశ్య శక్తులపై అలుపెరగని పోరాటం

Cyber Crime

Cyber Crime

Cyber Crime: అమాయక యువతను బెట్టింగ్ ఊబిలోకి నెట్టి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్న అదృశ్య శక్తుల గురించిన చేదు నిజాలు రోజురోజుకూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ కేటుగాళ్ల ఆట కట్టించడం కేవలం పోలీసుల బాధ్యతేనా? సామాన్య పౌరులుగా మనకేమీ సంబంధం లేదా? అంటే.. కచ్చితంగా ఉందనే చెప్తున్నారు న్యాయ నిపుణులు, సీనియర్ పోలీస్ అధికారులు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న బెట్టింగ్ నెట్‌వర్క్‌లను తుదముట్టించడంలో ప్రతి పౌరుడూ ఒక బాధ్యతాయుతమైన సైనికుడిలా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు.

భయం వీడండి.. రహస్యంగా సమాచారం అందించండి

చాలామందికి బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం ఉన్నా, “మనకెందుకులే” అనో లేదా “పోలీస్ స్టేషన్‌కు తిరగాలా” అనే భయంతోనో నోరు మెదపడం లేదు. కానీ, నేటి డిజిటల్ యుగంలో మీ గుర్తింపును పూర్తిగా రహస్యంగా ఉంచుతూనే పోలీసులకు సమాచారం అందించవచ్చు. ప్రతి జిల్లా లేదా సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930), అలాగే ప్రత్యేక సైబర్, టాస్క్‌ఫోర్స్ వాట్సాప్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి వివరాలు, బ్యాంక్ ఖాతాలు లేదా యాప్ లింకులను నేరుగా ఈ నంబర్లకు మెసేజ్ చేయవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (Cybercrime.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ‘ఇన్ఫార్మర్ గోప్యత’ చట్ట ప్రకారం సమాచారం ఇచ్చేవారి పేరు, చిరునామా ఎక్కడా బయటకు రాకుండా చూసే బాధ్యత పోలీసులదే.

సమాజానిది ప్రాథమిక బాధ్యత

బెట్టింగ్ రాయుళ్లు కళ్లముందే విలాసవంతంగా ఎదుగుతున్నారంటే, దాని వెనుక వందల కుటుంబాల శోకం ఉందనే విషయాన్ని గుర్తించాలి. హఠాత్తుగా ఏరియాలో కొందరు యువకులు ఏ పనీ చేయకుండా కోట్ల రూపాయల లావాదేవీలు జరుపుతున్నా, విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నా వారి మూలాలపై పోలీసులకు అనుమానాస్పద సమాచారం అందించాలి. అలాగే సొంత ఇంట్లోనే మొదటి నిఘా వేయాలి. పిల్లలు, మిత్రులు హఠాత్తుగా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారా లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేసి మానసిక ఒత్తిడికి గురవుతున్నారా అనేది నిరంతరం గమనించాలి.

ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ.. కౌన్సెలింగ్

బెట్టింగ్‌పై ఫిర్యాదు చేసే పౌరులకు ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుంది. ఇన్ఫార్మర్ పేర్లు కేవలం ఉన్నతాధికారుల లాగిన్లలో మాత్రమే ఉండేలా చట్టపరమైన రక్షణ ఉంటుంది. మరోవైపు బెట్టింగ్ వ్యసనంలో పడి ఆస్తులు పోగొట్టుకుని, ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్న బాధితులకు ప్రభుత్వం ఉచితంగా కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా సాయం అందిస్తోంది. నేరపూరిత బెట్టింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులను చట్ట ప్రకారం ప్రభుత్వం జప్తు చేసే కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇప్పటికైనా పౌర సమాజం మేల్కొని సైబర్ నేరగాళ్లపై పోరాటానికి సన్నద్ధం కావాల్సి ఉంది.