NEPAL: నేపాల్‌కు డెడ్లీ ఫ్లడ్ హెచ్చరికలు !

నేపాల్‌కు డెడ్లీ ఫ్లడ్ హెచ్చరికలు!
చైనాలో భూకంపంతో మరింత ప్రమాదం!
సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు

మినిట్ 2 మినిట్, నేషనల్ డెస్క్(ఆగస్ట్ 29): ప్రకృతి వైపరీత్యాలు పొరుగు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇప్పటికే వరద బీభత్సంతో కోలుకోలేని దెబ్బ తిన్న నేపాల్‌ను ఈ భూకంపం మరింత వణికించేలా చేసింది. ఈ ప్రకంపనాల తీవ్రత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టించింది.

ఐదు రెట్ల తీవ్రత

మూడు రోజుల క్రితం వచ్చిన ఆకస్మిక వరదల కన్నా, రాబోయే రెండు రోజుల్లో దాదాపు ఐదు రెట్లు అధిక తీవ్రత కలిగిన ‘డెడ్లీ ఫ్లడ్’ నేపాల్‌ను ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప ప్రకంపనల వల్ల పర్వత ప్రాంతాల్లో సంభవించే కొండచరియలు విరిగిపడటం, నదీ ప్రవాహాలు ఆకస్మికంగా ఉప్పొంగే ప్రమాదం ఉండటంతో స్థానిక అధికారులు, పోలీసులు నేపాల్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ భయానక హెచ్చరికలతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లను, సర్వస్వాన్ని వదులుకుని కొండ ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తున్నారు.

నిలిచిపోయిన సహాయక చర్యలు

మరోవైపు ఆకస్మిక వరద ముప్పు తీవ్రంగా పెరగడంతో అక్కడ జరుగుతున్న సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. భద్రతా దళాలు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు నివారించేందుకు నేపాల్ ప్రభుత్వం, భద్రతా దళాలు యుద్ధపాతిపదికన చర్యలు చేపట్టాయి. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను వెంటనే ఖాళీ చేయిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతితో, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.