Mamata Hospital: మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని మమతా మెడికల్ హాస్పిటల్లో 14 నెలల పసిపాప మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని, చిన్నారి చనిపోయినప్పటికీ బతికే ఉందంటూ సీపీఆర్ చేస్తూ డాక్టర్లు నాటకమాడారని బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వెంటిలేటర్ వైఫల్యం.. ఆసుపత్రి వద్ద నిరసన
కింద పడటంతో తలకు తీవ్ర దెబ్బతగిలిన 14 నెలల పసిపాపను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం బాచుపల్లిలోని మమతా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. ఉదయం 4:00 గంటలకు పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఉదయం 7:00 గంటల సమయానికి కూడా పాప సాధారణ స్థితిలోనే ఉందని, కోలుకుంటోందని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఉదయం 9:00 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని వెంటిలేటర్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో పాప పరిస్థితి ఉన్నట్టుండి విషమించిందని డాక్టర్లు హడావిడి చేయడం ప్రారంభించారు. వెంటిలేటర్ మానిటర్‌పై హార్ట్ బీట్ లైన్ నిశ్చలంగా మారి పాప ప్రాణాలు కోల్పోయినప్పటికీ, వైద్యులు సీపీఆర్ చేస్తున్నట్లు నాటకమాడుతూ కాలయాపన చేశారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. వెంటిలేటర్ పనిచేయకపోవడం, సరైన సమయంలో అత్యవసర వైద్యం అందించకపోవడమే ఈ ఘోరానికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తీరని శోకసంద్రంలో కుటుంబం
ఎంతో కాలం నిరీక్షణ తర్వాత పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల వైద్యాధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి బలికావడంతో ఆ కుటుంబంలో తీరని శోకసంద్రం నెలకొంది. ఈ ఘటనపై బాధిత బంధువులు, స్థానికులు ఆసుపత్రి ఆవరణలో భారీ నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిరసనకారులను సర్దిచెప్పి, ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
