ఇన్ఫ్లూయన్సర్లున్నారు జాగ్రత్త! మీ నష్టాలే వారి కోట్ల ఆదాయం

online betting

online betting

online betting: ఒకప్పుడు ఊళ్లలో, బస్టాండ్లలో ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే బోర్డులు కనిపించేవి. కానీ మారుతున్న డిజిటల్ యుగంలో, రాబోయే రోజుల్లో ‘ఇన్ఫ్లూయన్సర్లున్నారు జాగ్రత్త!’ అని హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. చేతిలో స్మార్ట్ ఫోన్, నాలుగు రీల్స్, ఓ నలుగురు ఫాలోవర్లు ఉంటే చాలు.. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు విచక్షణ కోల్పోయి రెచ్చిపోతున్నారు. తమను అభిమానించే యువత నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ, ‘ప్రోమో కోడ్’ల పేరిట బెట్టింగ్ యాప్స్ విషవలయంలోకి అమాయక కుర్రాళ్లను నెట్టేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానెళ్లలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న కొందరు స్టార్లు, “నాతో ఆడి రూ. 10 వేలు గెలవండి”, “ఈ ప్రోమో కోడ్ వాడితే బోనస్ వస్తుంది” అంటూ రంగురంగుల ఆశలు చూపిస్తున్నారు. నిజానికి ఇదొక అతిపెద్ద అఫిలియేట్ ట్రాప్. యువత తెలుసుకోవాల్సిన చేదు నిజం ఏంటంటే.. మీ ఇష్టమైన ఆ సోషల్ మీడియా స్టార్ విలాసవంతమైన కార్లు కొంటున్నా, కోట్లు సంపాదిస్తున్నా, ఆ డబ్బంతా మీరు బెట్టింగ్ యాప్స్‌లో ఓడిపోతే వారికి వచ్చే కమీషన్ల ద్వారానే సమకూరుతోంది! మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటూ ఉంటే, ఆ నష్టాల్లో నుంచే వీరికి వాటాలు అందుతున్నాయి.

మనం మార్కెట్లో ఒక చిన్న వస్తువు కొనాలంటేనే పది రకాలుగా ఆలోచిస్తాం. నాణ్యత ఉందా లేదా, మనకు అవసరమా కాదా అని బేరీజు వేసుకుంటాం. మరి అలాంటిది, కేవలం స్క్రీన్ మీద కనిపించి మాయమాటలు చెప్పే ఇన్ఫ్లూయన్సర్లను గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు? వస్తువు బాగున్నా బాగోలేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా డబ్బుల కోసం వీరు ఏదైనా ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి యువత జీవితాలను నాశనం చేస్తున్న వారిలో ఈ సోషల్ మీడియా సెలబ్రిటీలే అతి ముఖ్యులు.

క్లిక్‌లు, వ్యూస్, కమీషన్ల మత్తులో పడి వీరు చేసే ప్రచారాల వల్ల ఎంతోమంది యువకులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే యువత తస్మాత్ జాగ్రత్త! సోషల్ మీడియాలో కనిపించే రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోకండి. ప్రోమో కోడ్‌ల ఉచ్చులో పడి మీ జేబులను గుల్ల చేసుకోకండి. ఇన్ఫ్లూయన్సర్ల మాటలను గుడ్డిగా నమ్మకుండా, విచక్షణతో ఆలోచించి మీ భవిష్యత్తును కాపాడుకోండి.